పెద్దచెల్మెడ జడ్పీ ఉన్నత పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన
రూ.1.62 కోట్లతో భవన నిర్మాణం –మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 25 (రథసారథి న్యూస్):
మునిపల్లి మండలంలోని పెద్దచెల్మెడ గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్) నూతన భవన నిర్మాణానికి శనివారం స్థానిక సర్పంచ్ రాధాబాయి బాలకృష్ణ జోషి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాధాబాయి బాలకృష్ణ జోషి మాట్లాడుతూ, గతంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన హామీ మేరకు పెద్దచెల్మెడ జడ్పీ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ.1.62 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ భవనం నిర్మాణంతో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లోడి సతీష్ కుమార్ మాట్లాడుతూ, అందోల్ నియోజకవర్గంలోని ముదిమాణిక్, పెద్దచెల్మెడ జడ్పీ ఉన్నత పాఠశాలల భవన నిర్మాణాలకు మొత్తం రూ.3.20 కోట్ల నిధులు మంజూరు చేయించి పరిపాలనా అనుమతులు పొందేలా కృషి చేసిన మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైకోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం హామీలను అమలు చేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోందని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంతోషి కుమారి మాట్లాడుతూ, నూతన పాఠశాల భవన నిర్మాణానికి సహకరించిన మంత్రి దామోదర రాజనర్సింహ, స్థానిక ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమం అనంతరం విద్యార్థులు, గ్రామస్థులకు స్థానిక సర్పంచ్ భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామిరెడ్డి, ఉపాధ్యాయులు సోమలింగం, దుర్గయ్య, సూరజ్, రవీందర్, కిష్టయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీవాణి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



