భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
-వాగులు, వంకలు, కాజ్‌వేల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి-లోతట్టు ప్రాంతాలను గుర్తించి పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలి -జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 31 (రథసారథి న్యూస్):- రాష్ట్రంలో కొనసాగుతున్న వాతావరణ మార్పులు, భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వచ్చే వారంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠంగా సిద్ధం చేయాలని సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండుతో కలిసి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, పశుసంవర్ధక, విద్య, మత్స్య, పోలీస్ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లాలో నమోదైన వర్షపాతం, రానున్న రోజుల వర్ష సూచనలు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేయాలని చెప్పారు. జిల్లాలోని అన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాత భవనాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామాల వారీగా పూర్తి వివరాలను అన్ని శాఖలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, కాలువల నీటి ప్రవాహాన్ని ఇరిగేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కాజ్‌వేలపై నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రజలను అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో వరదలు లేదా ఇతర నష్టాలు సంభవించిన వెంటనే సంబంధిత అధికారులు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించి అత్యవసర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజలు, పశుసంపద, పంటలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరగకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మిషన్ మోడ్‌లో నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రత్యేక మండల అధికారులు తమకు కేటాయించిన మండలాల్లో స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. త్రాగునీటికి ప్రాధాన్యతనివ్వాలని,జిల్లాలో ప్రజలకు ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూసి రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటల సాగు చేయకుండా, భూగర్భ జలాల లభ్యత, ఎల్‌నినో ప్రభావం దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ, వరదనీటి పారుదల, అత్యవసర సేవలకు సంబంధించి ముందస్తు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, రాత్రికి రాత్రే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి మండలంలో ప్రత్యేక విపత్తుల నివారణ కమిటీలు ఏర్పాటు చేసి తరచూ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదకర చెరువులు, కాలువలు, కాజ్‌వేలు, ఇతర ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.



