Sangareddy

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం

జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటల ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కంట్రోల్ రూమ్ నెంబర్ 08455-276155

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (రథసారథి న్యూస్):
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటల పాటు పనిచేసే ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రజల నుండి అందే అత్యవసర ఫిర్యాదులు, సమాచారం, నష్టం వివరాలను వెంటనే స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు చేరవేసి తక్షణ చర్యలు తీసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ప్రజలు భారీ వర్షాల కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు, వరదలు, రహదారి అంతరాయాలు, చెట్లు కూలిపోవడం, విద్యుత్ సమస్యలు లేదా ఇతర ప్రమాదాలకు సంబంధించిన సమాచారాన్ని 08455-276155 నంబర్‌కు వెంటనే తెలియజేయాలని తెలిపారు. కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహించదానికి సిబ్బందిని మూడు షిఫ్టుల్లో నియమించామని, అందిన ప్రతి ఫిర్యాదును రిజిస్టర్‌లో నమోదు చేసి సంబంధిత తహసీల్దార్‌కు వెంటనే పంపించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లాలోని రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్, మున్సిపల్, విద్యుత్, వైద్య, అగ్నిమాపక తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు అవసరం లేనప్పుడు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, చెరువులు, వరద నీటి ప్రవాహాల వద్దకు వెళ్లరాదని, అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button