రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టి కృషి అవసరం
రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టి కృషి అవసరం-జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (రథసారథి న్యూస్):
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి, ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాల్లో వెంటనే నివారణ చర్యలు చేపట్టి జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఫిర్యాదుల సభామందిరంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును సమీక్షించిన కలెక్టర్, జిల్లాలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్న ప్రాంతాలు, వాటి వెనుక ఉన్న కారణాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ప్రమాదాల నివారణకు ప్రతి శాఖ చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్న ప్రాంతాల్లో తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ప్రమాదాన్ని సమగ్రంగా విశ్లేషించి, భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు అమలు చేయాలని పేర్కొన్నారు. రోడ్ల ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడం, గుంతలు, ఎత్తుపల్లాలను వెంటనే మరమ్మతు చేయడం, అవసరమైన చోట రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం, ప్రధాన కూడళ్లలో ఎత్తైన విద్యుద్దీపాలను ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో తగిన వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు.
అలాగే ప్రమాద ప్రాంతాలు, రహదారి దాటే ప్రదేశాల వద్ద వేగ నియంత్రణ పట్టీలు, హెచ్చరిక ఫలకాలు, ప్రతిఫలించే సూచిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్య సేవలు అందేలా జిల్లాలోని అత్యవసర చికిత్స కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల లభ్యత, అత్యవసర వైద్య పరికరాలు, అంబులెన్స్ సేవలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణ ఒక్క శాఖ బాధ్యత కాదని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అమూల్యమైన మానవ ప్రాణాలను రక్షించే దిశగా అంకితభావంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు పోలీసు అధికారి చైతన్య రెడ్డి, రహదారులు–భవనాల శాఖ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, ఉప పోలీసు అధికారుులు, రవాణా శాఖ అధికారులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతినిధులు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



