వరుణ్ బెవరేజెస్ పరిశ్రమలో సీఐటీయూ ఘన విజయం
పరిశ్రమలో విజయం కార్మికులకే అంకితం: చుక్కా రాములు -కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడేది సీఐటీయూనే-చారిత్రాత్మక వేతన ఒప్పందం కుదురుస్తాం

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 7 (రథసారథి న్యూస్):
రంగారెడ్డి పట్టణంలోని వరుణ్ బెవరేజెస్ (పెప్సీ) పరిశ్రమలో నిర్వహించిన కార్మిక సంఘం ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం సాధించింది. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు హెచ్‌ఎంఎస్ రాష్ట్ర నాయకుడు సదానందంపై విజయం సాధించారు. మొత్తం 191 ఓట్లు పోలవగా, సీఐటీయూకు 114 ఓట్లు, హెచ్‌ఎంఎస్‌కు 77 ఓట్లు లభించాయి. దీంతో సీఐటీయూ 37 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. విజయోత్సవ సభలో చుక్కా రాములు మాట్లాడుతూ, ఈ విజయం పూర్తిగా కార్మికుల ఐక్యతకు, విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.
ఎన్నికల సమయంలో హెచ్‌ఎంఎస్ నాయకులు పలు ప్రలోభాలకు గురిచేయడంతో పాటు, యాజమాన్యం కూడా కార్మికులపై ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ, కార్మికులు ఐక్యంగా నిలిచి సీఐటీయూను ఆదరించి విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ఈ విజయంతో పరిశ్రమలో కార్మికులకు చారిత్రాత్మకమైన వేతన ఒప్పందం కుదుర్చేందుకు కృషి చేస్తామని, వీవీబీఎల్ పరిశ్రమలో ఇప్పటివరకు జరిగిన వాటికన్నా మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధించి కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. కార్మిక వర్గం ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి. మల్లేష్, జిల్లా కార్యదర్శి జి. సాయిలు, యూనియన్ జనరల్ సెక్రటరీ భీమ్‌రెడ్డి, ఇతర నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



