బీజేవైఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బొర్రా ప్రవీణ్ యాదవ్‌కు రెండోసారి బాధ్యతలు
పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బొర్రా ప్రవీణ్ యాదవ్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 20 (రథసారథి న్యూస్):
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బొర్రా ప్రవీణ్ యాదవ్‌ను రెండోసారి నియమించారు. ఈ సందర్భంగా పార్టీ అధినాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై మరోసారి విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ అవకాశం కల్పించిన సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోదారి అంజిరెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందు, అలాగే తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నియామకం తన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా, సంగారెడ్డి జిల్లా యువతపై పార్టీ ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.
పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. బీజేవైఎం సిద్ధాంతాలకు అనుగుణంగా యువతలో జాతీయవాద భావజాలాన్ని పెంపొందించడంతో పాటు సేవాభావం, నాయకత్వ లక్షణాల వికాసానికి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రతి మండలం, ప్రతి గ్రామంలో బీజేవైఎం సంస్థాగత బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి యువశక్తిని పార్టీ అభివృద్ధికి వినియోగిస్తామని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలు, యువత, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల తరఫున ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను పదవిగా కాకుండా ప్రజాసేవకు దక్కిన అవకాశంగా భావిస్తూ, కార్యకర్తలందరినీ కలుపుకొని బీజేపీ, బీజేవైఎం సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని బొర్రా ప్రవీణ్ యాదవ్ తెలిపారు.



