రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 20 (రథసారథి న్యూస్):
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీలపై సోషల్ మీడియాలో అత్యంత అభ్యంతరకరమైన, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మున్నూరు రోహిత్ ఈ మేరకు స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు.
ఆ ఫిర్యాదు వివరాల ప్రకారం… జూలై 18న సరూర్ నగర్‌లో జరిగిన ‘యువ సంగ్రామ సభ’ సందర్భంగా కొందరు వ్యక్తులు కాంగ్రెస్ అగ్రనేతలను ఉద్దేశించి తీవ్రమైన, అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వీడియోలో మాట్లాడిన వ్యక్తులు సమాజంలో హింసను ప్రేరేపించేలా, రాజకీయ నాయకులపై ద్వేషాన్ని పెంచేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బహిరంగ వేదికలపై ఇటువంటి బాధ్యతారహితమైన భాషను ఉపయోగించడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యవహారంపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్నూరు రోహిత్ డిమాండ్ చేశారు.
వీడియోలో ఉన్న వ్యక్తులను గుర్తించి, భారతీయ న్యాయ సంహిత (బి ఎన్ ఎస్), 2023 లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, అలాగే ఈ అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రచారం చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి నియోజకవర్గ ప్రెసిడెంట్ వెంకట్, వైస్ ప్రెసిడెంట్ రోహిత్, నాయకులు వంశిధర్ రెడ్డి ,సాజిద్ లు పాల్గొన్నారు



