Sangareddy

ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 21 (రథసారథి న్యూస్):

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎలక్ట్రోరల్ రోల్‌ను ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా రూపొందించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే భారత ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు.

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నందున, నిర్ణీత గడువులోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లాలో ఎస్‌ఐఆర్ పురోగతిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు సగటున 70 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు.

నియోజకవర్గాల వారీగా నారాయణఖేడ్‌లో 85 శాతం, అందోల్‌లో 80 శాతం, జహీరాబాద్‌లో 75 శాతం, సంగారెడ్డిలో 71 శాతం, పటాన్‌చెరులో 52 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు.పటాన్‌చెరు నియోజకవర్గంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో మాట్లాడుతూ, అన్ని నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా పటాన్‌చెరు నియోజకవర్గంలో వార్డు అధికారులు, ఇతర వాలంటీర్ల సహకారంతో ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.అలాగే పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని, వలస వెళ్లిన వారు, మృతి చెందిన వారు, డబుల్ ఓటర్లు వంటి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించి, తప్పులు లేని పారదర్శక ఓటరు జాబితాను రూపొందించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button