సంగారెడ్డిలో వైభవంగా శ్రీ జగన్నాథ బహుద రథయాత్ర
ఇస్కాన్ ఆధ్వర్యంలో హరినామ సంకీర్తనలు.. భక్తి పారవశ్యంలో భక్తులు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి పట్టణంలోని 10వ వార్డు పొన్నకాలనీలో శుక్రవారం ఇస్కాన్ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం) ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ బహుద రథయాత్ర భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ పోచమ్మ ఆలయం నుంచి సండే మార్కెట్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వరకు హరినామ సంకీర్తనలు, భజనలు, భక్తుల జయజయధ్వానాల నడుమ రథయాత్ర ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శ్రీ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, శ్రీ జగన్నాథ రథయాత్రలు గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా నిర్వహించబడటం ఆనందదాయకమని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పరిచయం చేయడం ద్వారా మంచి భావితరాన్ని తీర్చిదిద్దవచ్చని అన్నారు. ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత సందేశాన్ని, శ్రీకృష్ణ భక్తిని, హరినామ సంకీర్తనలను విస్తృతంగా ప్రచారం చేస్తోందని కొనియాడిన ఆమె, కలియుగంలో హరినామ స్మరణే మానవాళికి శాంతి, ఆధ్యాత్మిక వికాసానికి మార్గమని పెద్దలు చెప్పిన సందేశాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ది మాస్టర్ మైండ్ ఈ-టెక్నో స్కూల్ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు.
రథయాత్ర సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, హరినామ సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు భక్తి పారవశ్యంలో రథాన్ని లాగుతూ శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శైలేష్ రెడ్డి, ది మాస్టర్ మైండ్ ఈ-టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ నవనీత, ఇస్కాన్ భక్త బృందం, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.


