సంగారెడ్డిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (రథసారథి న్యూస్):
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశాల మేరకు శుక్రవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ కృషి చిరస్మరణీయమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ కేసీఆర్ సేవలు అవసరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని పక్కనబెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుడు చింత సాయినాథ్ మాట్లాడుతూ, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల తరఫున కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని, ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు.
యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ అభివృద్ధి, సమర్థ పరిపాలనలో తనదైన ముద్ర వేసిన నాయకుడు కేటీఆర్ అని పేర్కొన్నారు. అనంతరం పార్టీ నాయకులు కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ నినాదాలు చేశారు. జన్మదిన వేడుకల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, చింత గోపాల్, కొండల్ రెడ్డి, నాగరాజు గౌడ్, రామప్ప, మల్ల గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, మధుసూదన్ రెడ్డి, విఠల్, పెద్దగొల్ల ఆంజనేయులు, నాయకులు వేణుగోపాల స్వామి, కౌన్సిలర్లు లాడె మల్లేశం, పొన్న రాజేందర్ రెడ్డి, నవీన్, దశరథ్ రెడ్డి, జాఫర్, సురేష్, శ్రీధర్ రెడ్డి, లాడె బాలు, విష్ణువర్ధన్, వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్‌వీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


