Sangareddy

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన బీఆర్ఎస్ నేతలు

జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి కీలక రహదారి ప్రాజెక్టులపై వినతులు

జహీరాబాద్–బీదర్ రహదారికి జాతీయ హోదా, ఎన్‌హెచ్–65 విస్తరణ, దిగ్వాల్‌లో ఫ్లైఓవర్ నిర్మాణం కోరిన ఎమ్మెల్యేలు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (రథసారథి న్యూస్):

జహీరాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కీలకమైన రహదారి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానించే జహీరాబాద్–బీదర్ రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి నాలుగు లేన్లుగా విస్తరించాలని వారు కోరారు. న్యాల్కల్ మండలంలో నిమ్జ్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఇతర పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధితో ఈ మార్గంలో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగిందని, రెండు రాష్ట్రాల మధ్య రవాణా, వాణిజ్య, వైద్య సేవలకు ఈ రహదారి కీలకంగా మారిందని వివరించారు. రహదారి విస్తరణతో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు.

హైదరాబాద్‌కు ప్రధాన అనుసంధాన మార్గమైన జహీరాబాద్–సంగారెడ్డి జాతీయ రహదారి (ఎన్‌హెచ్–65)ని ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా విస్తరించాలని మరో వినతిపత్రంలో కోరారు. జహీరాబాద్ ప్రాంతంలో పారిశ్రామిక విస్తరణ కారణంగా భారీ సరుకు రవాణా వాహనాలు, కంటైనర్ల రాకపోకలు పెరిగి తరచూ ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ రహదారి ఆరు లేన్లుగా మారితే ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు అత్యవసర వైద్య సేవలు, పారిశ్రామిక రవాణా మరింత వేగవంతమవుతుందని వివరించారు.

కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ప్రతిపాదించిన 25 మీటర్ల ఫ్లైఓవర్ లేదా అండర్‌పాస్‌ను 30 మీటర్లకు విస్తరించాలని కూడా కేంద్ర మంత్రిని కోరారు. పరిసర గ్రామాల ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగుల రాకపోకలకు ఈ మార్గం అత్యంత కీలకమని, భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పరిమాణాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు, వర్షపు నీటి పారుదల కోసం స్టార్మ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ, బస్ షెల్టర్ల నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టాలని సూచించారు.

జహీరాబాద్ ప్రాంత పారిశ్రామికాభివృద్ధి, ప్రజల రవాణా సౌకర్యాలు, రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని సమర్పించిన ఈ ప్రతిపాదనలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్వీకరించి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మాణిక్‌రావు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button