పిల్లల రక్షణలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం
ప్రతి పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ వ్యవస్థను పటిష్టం చేయాలి-జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానీ చంద్ర, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 25 (రథసారథి న్యూస్):
పిల్లలకు సురక్షితమైన, భయరహితమైన విద్యా వాతావరణాన్ని కల్పించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్ శ్రీమతి జి. భవానీ చంద్ర పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవా సంస్థ (నాల్సా) రూపొందించిన “చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్ స్కీమ్–2024” అమలు, అలాగే తెలంగాణ పాఠశాల విద్యాశాఖతో కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో, జిల్లా విద్యాశాఖ సమన్వయంతో శనివారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నియమితులైన చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు ఒక రోజు సెన్సిటైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానీ చంద్ర, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లాలోని 239 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 239 మంది ఉపాధ్యాయులను చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా నియమించినట్లు అధికారులు తెలిపారు. వీరికి బాలల హక్కుల పరిరక్షణ, పాఠశాల స్థాయిలో సమస్యలను గుర్తించడం, చట్టపరమైన రక్షణ, సంబంధిత శాఖలతో సమన్వయం వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానీ చంద్ర మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి సురక్షితమైన, హింసరహిత విద్యా వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను నిశితంగా గమనిస్తూ, బాలలపై వేధింపులు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మాదకద్రవ్యాల ప్రభావం, పోక్సో చట్టం, సైబర్ నేరాలకు సంబంధించిన అనుమానాస్పద పరిస్థితులు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
పిల్లల రక్షణను అదనపు బాధ్యతగా కాకుండా సమాజానికి చేసే సేవగా భావించాలని ఆమె పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు సమర్థవంతంగా పనిచేస్తే బాలల రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. పిల్లలతో స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచి వారి విశ్వాసాన్ని పొందాలని, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ భద్రత, ఆన్లైన్ మోసాలు, మానసిక ఆరోగ్యం, బాలల హక్కులు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ప్రవర్తనా మార్పులను ప్రారంభ దశలోనే గుర్తించి తల్లిదండ్రులు, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అదనపు పోలీసు సూపరింటెండెంట్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, బాలల భద్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. పోక్సో చట్టం, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగంపై విద్యార్థులకు నిరంతరం అవగాహన కల్పించాలని, పిల్లలు లేదా తల్లిదండ్రులు సమస్యలను వెల్లడించలేని సందర్భాల్లో ఉపాధ్యాయులే ముందుండి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి బి. సౌజన్య మాట్లాడుతూ, చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్ స్కీమ్–2024 లక్ష్యాలను వివరించారు. పాఠశాల స్థాయిలో బాలల సమస్యలను గుర్తించి, అవసరమైన సందర్భాల్లో జిల్లా న్యాయ సేవా సంస్థతో సమన్వయం చేసుకుంటూ బాధిత బాలలకు ఉచిత న్యాయ సహాయం, కౌన్సెలింగ్, రక్షణ చర్యలు అందేలా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు కృషి చేయాలని సూచించారు.
అనంతరం పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీలేఖ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి డి.వి.ఆర్. తేజో కార్తీక్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. ధనలక్ష్మి పోక్సో చట్టం, బాలల హక్కులు, పాఠశాలల్లో చైల్డ్ ప్రొటెక్షన్ వ్యవస్థ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల బాధ్యతలు, బాలలపై వేధింపులను గుర్తించే విధానాలు, న్యాయ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. సంజీవ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాజారెడ్డి, వివిధ శాఖల అధికారులు, జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి నియమితులైన చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు (ఉపాధ్యాయులు) తదితరులు పాల్గొన్నారు.



