నీట్ ఉద్యమం యువత చారిత్రక విజయానికి నిదర్శనం
లాఠీలను ఎదుర్కొని ఢిల్లీ పీఠాన్ని కదిలించిన 'జెన్ జీ' విద్యార్థులు: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 25 (రథసారథి న్యూస్):
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో న్యాయం కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం యువత చారిత్రక విజయానికి ప్రతీకగా నిలిచిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. లక్షలాది మంది నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేశాయని ఆయన విమర్శించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదివిన విద్యార్థుల ఆశలను కొందరు అక్రమార్కులు, దళారులు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయాన్ని మౌనంగా భరించకుండా హక్కుల సాధన కోసం దేశ రాజధానిలో విద్యార్థులు చేపట్టిన శాంతియుత ఆందోళనలు, నిరాహార దీక్షలు దేశ ప్రజలను ఆలోచింపజేశాయని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం వారి ఆవేదనను పట్టించుకోకుండా పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు.
హక్కుల కోసం ప్రశ్నించిన గొంతులను అణచివేయాలనే ప్రయత్నాలు యువత ధైర్యసాహసాల ముందు నిలవలేకపోయాయని పేర్కొన్నారు. విద్యార్థుల నిరంతర పోరాటం, దేశవ్యాప్తంగా వ్యక్తమైన ప్రజా ఆగ్రహం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమ విజయానికి నిదర్శనమని చింతా ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.
ఇది కేవలం ఒక మంత్రి రాజీనామా మాత్రమే కాకుండా, యువత ఐక్యత, సంకల్పానికి లభించిన విజయమని పేర్కొన్నారు. అయితే మంత్రి రాజీనామాతోనే సమస్య ముగిసిపోదని, నీట్ అక్రమాల వెనుక ఉన్న అసలు బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుని, బాధిత విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా వ్యవస్థలో సంపూర్ణ పారదర్శకత నెలకొల్పే వరకు విద్యార్థులు, యువతకు తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు.



