Sangareddy

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు

సంగారెడ్డి పట్టణంలోని భారతీయ విద్యా మందిర్ పాఠశాల 1999–2000 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు మల్కాపూర్ శివారులో ఆషాఢ బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు

సంగారెడ్డి ప్రతినిధి, జులై 26 (రథసారథి న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని భారతీయ విద్యా మందిర్ పాఠశాల 1999–2000 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు మల్కాపూర్ శివారులో ఆషాఢ బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలువురు పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయంలో వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, హారతులు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం అమ్మవారికి మహామంగళహారతి నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. దాదాపు పావు శతాబ్దం తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించారు.

గురువులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. సమాజంలో వివిధ రంగాల్లో స్థిరపడిన సహచరులను అభినందించడంతో పాటు, ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల ద్వారా పరస్పర అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఆషాఢ బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి, స్నేహం, సాంస్కృతిక సంప్రదాయాల సమ్మేళనంగా నిలిచింది.

ప్రతి ఏడాది ఇదే ఉత్సాహంతో కలిసి అమ్మవారి సేవలో పాల్గొంటూ సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టాలని పూర్వ విద్యార్థులు సంకల్పించారు. కార్యక్రమంలో 1999–2000 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button