అన్నారం రైతుల వినతి.. భూసేకరణ ఉత్తర్వులు నిలిపివేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి
-టి.జి.ఐ.ఐ.సి. పరిధిలోకి భూములు తీసుకుంటే జీవనాధారం కోల్పోతామని ఆందోళన

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 27 (రథసారథి న్యూస్): గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని సర్వే నంబరు 261/1లో ఉన్న తమ సాగుభూములను తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టి.జి.ఐ.ఐ.సి.) పరిధిలోకి తీసుకుంటున్నారనే వార్తల నేపథ్యంలో రైతులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో రైతులు పేర్కొన్న వివరాల ప్రకారం, 1984–85 సంవత్సరంలో 1979 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు భూమిలేని సుమారు 117 మంది నిరుపేద రైతులకు ఒక్కొక్కరికి ఒక ఎకరం చొప్పున అసైన్మెంట్ పట్టా భూములు కేటాయించారని తెలిపారు. అప్పటి నుంచి ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని పేర్కొన్నారు.
ఇటీవల తమ భూములను టి.జి.ఐ.ఐ.సి. పరిధిలోకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. ఈ విషయమై మండల రెవెన్యూ అధికారిని సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాచారం అందలేదని ఆరోపించారు. తమకు జీవనాధారమైన ఒకే ఒక్క ఎకరం భూమిని స్వాధీనం చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని, రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసి ఉంటే వాటిని వెంటనే రద్దు చేయాలని కలెక్టర్‌ను కోరారు.
అదేవిధంగా, సర్వే నంబరు 261/1లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై ఉంటే ముందుగా వాటిని గుర్తించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని, తమకు కేటాయించిన అసైన్మెంట్ భూములను మాత్రం స్వాధీనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రైతుల జీవనోపాధిని కాపాడేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.



