కొండాపూర్‌లో ప్రాథమిక అక్షరాస్యత–సంఖ్యాజ్ఞాన ఉపాధ్యాయ శిక్షణ పూర్తి
-విద్యార్థుల అభ్యాస లోపాల నివారణకు ప్రత్యేక బోధనా విధానాలపై అవగాహన

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 27 (రథసారథి న్యూస్): కొండాపూర్ మండలంలో ప్రాథమిక అక్షరాస్యత–సంఖ్యాజ్ఞాన కార్యక్రమం అమలులో భాగంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్వహించిన ఆరు రోజుల శిక్షణ విజయవంతంగా ముగిసింది.
రెండు విడతలుగా నిర్వహించిన ఈ శిక్షణలో మండలంలోని పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా భాష, గణిత అంశాల్లో అభ్యాసంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించడం, వారికి ప్రత్యేక బోధనా విధానాలు, అభ్యాస లోపాల నివారణకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.
ఈ ప్రత్యేక బోధనా కార్యక్రమాన్ని విద్యా సంవత్సరం ముగిసే మార్చి 15వ తేదీ వరకు అమలు చేయనున్నట్లు వివరించారు. అదేవిధంగా సమ్మిళిత విద్య అమలులో భాగంగా సమగ్ర ప్రగతి పత్రంలో నమోదు చేయాల్సిన వివరాలపై కూడా ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు అందించారు. ఈ శిక్షణకు దశరథ్ కోర్సు సంచాలకుడిగా వ్యవహరించగా, వనరుల వ్యక్తులుగా కులకర్ణి గణేష్‌రావు, మురళీకృష్ణ, చక్రధర్, మహేశ్వరి శిక్షణ అందించి వివిధ బోధనా అంశాలను వివరించారు.
అధికారులు ఉపాధ్యాయులు ఈ శిక్షణను విద్యార్థుల అభ్యాస నైపుణ్యాల మెరుగుదలకు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.



