Sangareddy

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ

-టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్

సంగారెడ్డి ప్రతినిధి జూలై 28 (రథసారథి న్యూస్):

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఐబీ నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌లోని శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు 51 బోనాలతో భక్తిశ్రద్ధలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు, పోతురాజుల విన్యాసాలు, భక్తుల కోలాహలంతో బోనాల ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత కిషన్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు హాజరై నాయి బ్రాహ్మణ సోదరులతో కలిసి పోతురాజుల నృత్యాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక బోనాలు సమర్పించి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. ఆషాఢ మాసంలో ఎల్లమ్మ తల్లి, నల్ల పోచమ్మ, దుర్గమ్మ తల్లికి బోనాలు సమర్పించడం తెలంగాణలో అనాదిగా వస్తున్న ఆచారమని పేర్కొన్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన బోనాన్ని నాయి బ్రాహ్మణులు సమర్పించడం విశేషమని తెలిపారు. మంగలి అంటే మంగళప్రదమైన జాతి అని, గతంలో వైద్య సేవలు అందించిన ఈ వర్గం నేడు కూడా సామాజిక డాక్టర్లుగా ప్రజలకు సేవలందిస్తోందని కొనియాడారు.

ఆషాఢ మాస బోనాల సందర్భంగా నాయి బ్రాహ్మణులకు, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కూన సంతోష్, కౌన్సిలర్ శ్రీకాంత్, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మాణిక్ ప్రభు, యాదయ్య, సుకుమార్, మోహన్, సత్యనారాయణ, సంతోష్ కుమార్, దయానందం, చంద్రప్రకాశ్, వెంకటేష్, నాగభూషణం, దత్తాత్రేయతో పాటు పెద్ద సంఖ్యలో నాయి బ్రాహ్మణులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button