పదవీ విరమణ పొందిన డి4సీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌కు ఘన వీడ్కోలు
-విశిష్ట సేవలను కొనియాడిన అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 31 (రథసారథి న్యూస్): తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలోని సంగారెడ్డి డి4సీ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన రవికుమార్కు శుక్రవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) చైతన్య రెడ్డి, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై రవికుమార్‌ను ఘనంగా సత్కరించి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, రవికుమార్ 1998లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు శాఖలో చేరి ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు పోలీసు స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని తెలిపారు. అనంతరం సైబర్ నేరాల విభాగంలో సేవలందిస్తూ సైబర్ మోసాల బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేసి విశేష సేవలు అందించారని కొనియాడారు.
సుదీర్ఘకాలం పోలీసు శాఖలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించి అధికారుల ప్రశంసలు పొందారని, తన సేవా కాలమంతా ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదగడం ఆయన నిజాయితీ, సేవాభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో సుఖసంతోషాల మధ్య ఆనందకర జీవితాన్ని గడపాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి4సీ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, ఈటీఈ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



