Sangareddy

వోక్సాన్ యూనివర్సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

యూనివర్సిటీ క్యాంటీన్‌లో సెనగపిండి నమూనాలు సేకరణ

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీ, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజేశ్వర్ ఆధ్వర్యంలోని బృందం స్థానిక వోక్సాన్ యూనివర్సిటీలోని క్యాంటీన్లను శనివారం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఇదివరకే రెండు విడతల్లో యూనివర్సిటీ క్యాంటీన్లను తనిఖీ చేసి పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచాలని సూచించినట్లు తెలిపారు. గతంలో నిబంధనల ఉల్లంఘనలపై జరిమానాలు కూడా విధించినట్లు పేర్కొన్నారు.

యూనివర్సిటీ పరిధిలోని అన్ని క్యాంటీన్లు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ నిబంధనలను పాటించాలని, ట్రేడ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పొందాలని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. ఆ సూచనలకు అనుగుణంగా యూనివర్సిటీ యాజమాన్యం అవసరమైన అనుమతులు పొందడంతో పాటు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా పలు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. తాజా తనిఖీల్లో భాగంగా క్యాంటీన్‌లో వినియోగిస్తున్న సెనగపిండి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. ప్రయోగశాల నివేదిక అందిన అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులకు విక్రయించే ఆహార పదార్థాలు నాణ్యమైనవి, సురక్షితమైనవి, పరిశుభ్రమైనవిగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అధికారులు స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button