కేజీబీవీ కొండాపూర్లో రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన
-విద్యార్థినులకు 3 వేల శానిటరీ ప్యాడ్ల పంపిణీ

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా గురువారం కొండాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినులకు రుతుక్రమ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శానిటరీ ప్యాడ్ బ్యాంకు కింద 3,000 శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి కె. లలిత కుమారి మాట్లాడుతూ, రుతుక్రమ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, నాణ్యమైన శానిటరీ ప్యాడ్లను వినియోగించడం, వాటిని నిర్ణీత వ్యవధిలో మార్చుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను నివారించవచ్చని తెలిపారు. రుతుక్రమం ప్రతి బాలిక జీవితంలో సహజ ప్రక్రియ అని, దీనిపై అపోహలు, భయాలు అవసరం లేదన్నారు.
ప్రభుత్వం బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. కె. లలితా దేవి మాట్లాడుతూ, యుక్తవయస్సులోని బాలికలు రక్తహీనతకు గురికాకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, పండ్లు, చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని, రుతుక్రమ సమయంలో పరిశుభ్రత, చేతుల శుభ్రత, తగిన విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలని విద్యార్థినులకు సూచించారు.
అనంతరం శానిటరీ ప్యాడ్ల సరైన వినియోగం, భద్రపరిచే విధానం, వినియోగం అనంతరం పరిశుభ్రంగా పారవేసే పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త పల్లవి, సీడీపీఓ చంద్రకళ, ఎస్ఓ కవిత, ఎంపీడీఓ, ఎంఈఓ, సర్పంచ్, పోలీసు శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, షీ టీమ్ సభ్యులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.



