తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్
-కలెక్టరేట్లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు-జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్):
తెలంగాణ రాష్ట్ర సాధనను జీవిత లక్ష్యంగా చేసుకుని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించి, తన జీవితాన్ని తెలంగాణ ప్రజల హక్కుల కోసం అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన ఆశయాలు భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండుతో కలిసి హాజరై ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని చారిత్రక, సామాజిక, ఆర్థిక ఆధారాలతో ప్రపంచానికి వివరించిన దార్శనికుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా, ఉద్యమకారుడిగా ఆయన చేసిన సేవలు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు. అదనపు కలెక్టర్ సంగీత మాట్లాడుతూ, జయశంకర్ ఉద్యమ నాయకుడిగానే కాకుండా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహా మేధావి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌కు సైద్ధాంతిక దిశానిర్దేశం చేసిన ఆయన రచనలు, ఉపన్యాసాలు, పరిశోధనలు ఉద్యమానికి అపారమైన మేధోబలాన్ని అందించాయని పేర్కొన్నారు.
విద్యారంగంలో ఆయన చేసిన సేవలు, సమానత్వం, ప్రాంతీయ న్యాయం, సామాజిక చైతన్యంపై చేసిన అధ్యయనాలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ చూపిన విలువలు, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.



