ఆగస్టు 10 జైల్ భరోను విజయవంతం చేయాలి: చుక్క రాములు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించే దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన ఆటో జాతాలో ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్‌ను అమలు చేస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచడం, కార్మిక హక్కులను హరించడం, కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణను ప్రోత్సహించడం ప్రజావ్యతిరేక చర్యలని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం, ఎనిమిది గంటల పనిదినం, ఓవర్‌టైంకు రెట్టింపు వేతనం అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర, ప్రభుత్వ కొనుగోలు హామీ కల్పించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి. మల్లేశం, జిల్లా కార్యదర్శి సాయిలు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బాగారెడ్డి, పాండు రంగారెడ్డి, నాయకులు ప్రసన్నరావు, నర్సింలు, నరేష్, బాలరాజు, శ్రీనివాస్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.



