
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని మునిపల్లి మండలం కామ్కోల్లోని వోక్సెన్ విశ్వవిద్యాలయంలో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య ముఖ్య అతిథిగా హాజరై న్యాయ విద్యార్థులు, ఇతర విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక వంటిదని, దేశ ప్రగతి, సమాజ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యతో పాటు రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కులు, విధులు, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు ఇతరుల హక్కులను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని విద్యార్థులకు సూచించారు.
ఆర్థికంగా వెనుకబడినవారు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు తదితర అర్హులైన వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం, ఉచిత న్యాయ సేవలు, మధ్యవర్తిత్వం, వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చట్టపరమైన సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. వోక్సెన్ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల డీన్ శ్రీమతి శ్రీలత మాట్లాడుతూ యువత న్యాయపరమైన అవగాహన పెంపొందించుకోవడంతో పాటు సమాజంలో న్యాయం, సమానత్వం, మానవతా విలువల పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సేవాభావం, చట్టాల పట్ల గౌరవాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తమ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులు ముందుకు రావాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో వోక్సెన్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, న్యాయ కళాశాల సిబ్బంది, న్యాయ విద్యార్థులు, ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.



