ఆహారం తీసుకున్న విద్యార్థులకు అస్వస్థత
-లోనికలాన్ పాఠశాలలో 34 మంది విద్యార్థులకు వాంతులు
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లోనికలాన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో గురువారం ఆహారం తీసుకున్న అనంతరం 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, ఇతర అస్వస్థత లక్షణాలు కనిపించడంతో పాఠశాల సిబ్బంది వెంటనే స్థానిక వైద్యులను సంప్రదించి వైద్యసేవలు అందించారు.
పాఠశాల సామాజిక సహాయకుడు ఎ. వెంకటేశం బయట నుంచి తీసుకొచ్చిన చికెన్ బిర్యానీని విద్యార్థులకు అందించేందుకు ప్రధానోపాధ్యాయుడి అనుమతి తీసుకున్నట్లు అధికారుల నివేదికలో పేర్కొన్నారు. అనుమతి లభించడంతో ఉదయం సుమారు 9.15 గంటలకు విద్యార్థులకు ఆహారాన్ని అందించారు. ఆహారం తీసుకున్న కొద్దిసేపటికే ఇద్దరు విద్యార్థులకు వాంతులు కాగా, అనంతరం మరికొందరిలోనూ ఇదే విధమైన లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థులను వైద్యుల వద్దకు తరలించి చికిత్స అందించారు. మొత్తం 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు బయట నుంచి ఆహారం తీసుకొచ్చి అందించిన ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.



