అంతర్జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
ఎనిమిది ద్విచక్ర వాహనాలు స్వాధీనం –కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని అభినందించిన ఎస్పీ

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 22 (రథసారథి న్యూస్): నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ద్విచక్ర వాహన దొంగతనం కేసును పోలీసులు ఛేదించి, అంతర్జిల్లా స్థాయిలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మొత్తం ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జూలై 21న ఉదయం నారాయణఖేడ్ శివారులోని వెంకటాపూర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ వ్యక్తి పోలీసులను గమనించి పారిపోవడానికి యత్నించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, మెగావత్ దుర్గ అలియాస్ దుర్గ ప్రసాద్ అలియాస్ దీపక్ (40)గా గుర్తించారు. స్వస్థలం మెదక్ జిల్లా కాగా, ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో నివాసం ఉంటున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి ఒప్పుకోలు మేరకు నారాయణఖేడ్, పాపన్నపేట, పిట్లం, నస్రుల్లాబాద్, వర్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో దొంగిలించిన మొత్తం ఎనిమిది ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీటిలో నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో నమోదైన రెండు కేసులకు సంబంధించిన వాహనాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిపై మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే పలు ద్విచక్ర వాహన దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను డూప్లికేట్ తాళాల సహాయంతో దొంగిలించి, నారాయణఖేడ్ శివారులోని ర్యాలమడుగు సమీప నిర్జన ప్రాంతంలో దాచిపెట్టినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు దొంగిలించిన ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న నారాయణఖేడ్ ఎస్ఐ శ్రీశైలం, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అభినందించారు.



