అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన తల్లీబిడ్డకు అండగా జగ్గారెడ్డి
-చంటిపాపకు వెంటనే చికిత్స అందేలా చర్యలు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీకి వచ్చిన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అర్ధరాత్రి నాలుగు నెలల చంటిబిడ్డతో ఆస్పత్రికి వచ్చిన ఓ తల్లికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. డ్రైవరుగా పనిచేస్తున్న భర్త విధుల్లో ఉండగా, నాలుగు నెలల పాపకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో తల్లి ప్రవళిక అర్ధరాత్రి సమయంలో ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది. ఏ విభాగానికి వెళ్లాలో తెలియక మహిళల వార్డు వద్ద ఆందోళనగా నిలిచిన ఆమెను అదే సమయంలో ఆస్పత్రి తనిఖీకి వచ్చిన జగ్గారెడ్డి గమనించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పాప పరిస్థితి విషమంగా ఉండటంతో జగ్గారెడ్డి తన వాహనంలో తల్లీబిడ్డను మాతా–శిశు ఆస్పత్రి (ఎంసీహెచ్)కు తీసుకెళ్లి, వైద్యులతో మాట్లాడి వెంటనే చికిత్స ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ప్రవళిక భర్తతో ఫోన్లో మాట్లాడి వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించారు. వైద్యులు పాపకు అవసరమైన చికిత్స అందించి, ఇటీవల ఇచ్చిన వ్యాక్సిన్ ప్రభావంతో ఫిట్స్ వచ్చినట్లు గుర్తించి తగిన వైద్యసేవలు అందించారు. క్లిష్ట సమయంలో జగ్గారెడ్డి స్పందించి తల్లీబిడ్డకు ధైర్యం చెప్పడంతో పాటు వెంటనే వైద్యసేవలు అందేలా చేయడం పట్ల పలువురు అభినందించారు.



