ఆగస్టు నెల సదరం శిబిరాల తేదీల విడుదల
ముందస్తు నమోదు చేసుకున్న వారికే ప్రవేశం -అవసరమైన పత్రాలు తప్పనిసరి
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 రథసారథి న్యూస్): ఆగస్టు నెలకు సంబంధించిన యుడిఐడి (సదరం) వైద్య ధ్రువీకరణ శిబిరాల నిర్వహణ తేదీలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ శిబిరాలు ఆగస్టు 5, 12, 19 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి సంగారెడ్డి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
వైకల్య ధ్రువీకరణ పత్రాల పునరుద్ధరణతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి యుడిఐడి పోర్టల్‌లో నిరంతరం స్లాట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆసక్తి గల వారు ముందుగా యుడిఐడి పోర్టల్‌లో స్లాట్ నమోదు చేసుకోవాలని సూచించారు. స్లాట్ నమోదు అనంతరం ఫోన్ కాల్ లేదా సందేశం ద్వారా సమాచారం అందిన అభ్యర్థులు మాత్రమే నిర్ణయించిన తేదీన ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిర్వహించే శిబిరానికి హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు.
శిబిరానికి హాజరయ్యే అభ్యర్థులు స్లాట్ నమోదు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు ప్రతిలిపి, పాస్‌పోర్టు పరిమాణంలోని తాజా ఛాయాచిత్రం, సంబంధిత వైద్య నివేదికలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. అవసరమైన పత్రాలు లేకుండా వచ్చిన వారికి సేవలు అందించడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు.


