Sangareddy

ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయానికి రాజకీయ పార్టీల సహకారం అవసరం

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను గడువులోగా పూర్తి చేస్తాం : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (రథసారథి న్యూస్):

జిల్లాలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు క్రియాశీలకంగా సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ పాండుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిని వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ సగటున 74 శాతం పూర్తయిందని తెలిపారు. నిర్ణీత గడువులోపు డిజిటలైజేషన్ పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణతో అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో గుర్తించిన వ్యత్యాసాలు (అనామలీస్) ఉన్న సందర్భాల్లో సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందులో పేర్కొన్న సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించడం ద్వారా తమ ఓటు హక్కును కొనసాగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లను గుర్తించి, బూత్ స్థాయి అధికారుల ద్వారా ఫారాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.

జిల్లాలో నియోజకవర్గాల వారీగా డిజిటలైజేషన్ పురోగతిని వివరిస్తూ నారాయణఖేడ్‌లో 87 శాతం, ఆందోల్‌లో 83 శాతం, జహీరాబాద్‌లో 78 శాతం, సంగారెడ్డిలో 74 శాతం, పటాన్‌చెరులో 58 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లాలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. తమ పరిశీలనలో గుర్తించిన పలు అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నారాయణఖేడ్ సబ్‌కలెక్టర్ ఉమాహారతి, ఈఆర్‌వోలు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button