కాంగ్రెస్ హామీ నిలబెట్టుకోవాలి.. సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలి
సీపీఎస్ ఉద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 21 (రథసారథి న్యూస్): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోరుతూ టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి చౌరస్తా నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం సంఘం నాయకులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఆ హామీ అమలు కాకపోవడం విచారకరమన్నారు.
ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. సీపీఎస్ ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటం న్యాయమైనదేనని పేర్కొన్న ఆయన, వారి ఉద్యమానికి తాను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బలంగా ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ నాయకులు, ఉద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



