Sangareddy

సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలి

టీఎస్‌సీపీఎస్‌ఈయూ బైక్ ర్యాలీకి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మద్దతు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 21 (రథసారథి న్యూస్): సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో నిర్వహించిన జన జాతరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన బైక్ ర్యాలీకి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దాపురం దుర్గయ్య మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచినా ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు.

సీపీఎస్ కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు లభిస్తున్న పెన్షన్ ఆసరా పెన్షన్ కంటే తక్కువగా ఉండటంతో, మూడు దశాబ్దాలపాటు సేవలందించిన ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సుమారు 2.40 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి బిట్టు వసంత్ కుమార్‌తో పాటు మనోహర్, విట్టల్, ప్రదీప్, గోపాల్, చంద్రయ్య, అశోక్, సర్దార్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button