Hyderabad

కేటీఆర్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఘాటు విమర్శలు

మాట నిలబెట్టుకునేది గాంధీ కుటుంబం.. మాట తప్పేది కేసీఆర్ కుటుంబం -రాహుల్, ప్రియాంక గాంధీలపై వ్యాఖ్యలు తెలంగాణ సంస్కృతికి విరుద్ధమని ఆగ్రహం

హైదరాబాద్ ప్రతినిధి, జూలై 19 (రథసారథి న్యూస్):

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. సరూర్‌నగర్ సభలో కేటీఆర్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబంపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తెలంగాణ సంస్కృతికి విరుద్ధమని జగ్గారెడ్డి అన్నారు.

ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతామని చెప్పిన కేసీఆర్ కుటుంబం, రాష్ట్రం ఏర్పడిన అనంతరం స్వయంగా వెళ్లి సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. కృతజ్ఞత, నిజాయితీ లేని రాజకీయాలకు కేసీఆర్ కుటుంబం నిదర్శనమని, మాట ఇస్తే నిలబెట్టుకునేది గాంధీ కుటుంబమైతే, మాట ఇచ్చి తప్పేది కేసీఆర్ కుటుంబమని విమర్శించారు. తెలంగాణ సంస్కృతి అనేది మంచి చేసిన వారిని ఆశీర్వదించే సంస్కృతేనని, ఎవరి నాశనాన్ని కోరుకునే సంస్కృతి కాదని పేర్కొన్నారు.

అదేవిధంగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 ప్రశ్నాపత్రాల లీకేజీతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వారి వద్దకు వెళ్లి సమాధానం చెప్పారా? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రూప్-1 ద్వారా 562 మంది అభ్యర్థులకు నియామకాలు కల్పించిందని, అలాగే వివిధ శాఖల్లో కలిపి సుమారు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ఈ అంశాలపై కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో ముందంజలో ఉందని, విలువలతో కూడిన రాజకీయాలకు గాంధీ కుటుంబం ప్రతీక అని జగ్గారెడ్డి అన్నారు. కాగా, బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button