విద్యార్థులకు మహిళల భద్రత, చట్టాలపై అవగాహన
ప్రభుత్వ వసతి గృహాల్లో షీటీమ్స్, మహిళా పోలీసుల ప్రత్యేక కార్యక్రమం

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 19 (రథసారథి న్యూస్):
విద్యార్థుల్లో మహిళల భద్రత, చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణకు దోహదపడే లక్ష్యంతో సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ బాలుర వసతి గృహాల్లో ఆదివారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ ఆదేశాల మేరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలను సంగారెడ్డి షీటీమ్ ప్రతినిధులు, మహిళా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మహిళలపై జరిగే వేధింపులు, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన రక్షణలు, మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన సేవల గురించి అధికారులు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్–112, మహిళల అత్యవసర సహాయ సేవలు, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్–1930 వంటి సేవలను ఎలా వినియోగించుకోవాలో తెలియజేశారు.
విద్యార్థులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, ఓటీపీలు వంటి సమాచారాన్ని సోషల్ మీడియా లేదా ఫోన్ ద్వారా ఎవరికీ అందించవద్దని సూచించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే మోసాలు, నకిలీ ఉద్యోగాలు, ఆన్‌లైన్ వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ వంటి సైబర్ నేరాల నుంచి ఎలా రక్షించుకోవాలో వివరంగా అవగాహన కల్పించారు. బాలికలు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా షీటీమ్స్‌కు తెలియజేయాలని, ఫిర్యాదు చేయడానికి ఎలాంటి భయం అవసరం లేదని పోలీసులు సూచించారు.
అలాగే బాలురకు మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించడం, చట్టాలను పాటించడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. మహిళల భద్రత, చట్టాలపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
షీటీమ్ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం ద్వారా నేరాల నివారణతో పాటు సురక్షిత సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యాసంస్థలు, వసతి గృహాల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.



