గీతన్న చైతన్య యాత్రను జయప్రదం చేయాలి
కల్లుగీత వృత్తి రక్షణకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ -పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 19 (రథసారథి న్యూస్):
కల్లుగీత వృత్తిని పరిరక్షించి, గౌడ సోదరులు, కల్లుగీత కార్మికులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుంచి 18 వరకు నిర్వహించనున్న గీతన్న చైతన్య యాత్ర ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం ఐబీ ప్రాంగణంలో గీతన్న చైతన్య యాత్రకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను మాజీ జెడ్పీటీసీలు మనోహర్ గౌడ్, మల్ల గౌడ్, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయ గౌడ్, జిల్లా కార్యదర్శి ప్రసాద్ గౌడ్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆశన్న గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో లక్షలాది కుటుంబాలు కల్లుగీత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. ఈ సంప్రదాయ వృత్తిని రక్షిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను కార్యరూపంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కల్లుగీత వృత్తి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.5,000 కోట్ల నిధులు కేటాయించాలని, ప్రతి గ్రామానికి ఐదు ఎకరాల భూమిని కల్లుగీత కార్మికుల అవసరాల కోసం కేటాయించాలని, సహజ కల్లుకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి కార్మికులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వృత్తికి సంబంధించిన సంక్షేమ పథకాలను విస్తరించి గౌడ సోదరుల జీవనోపాధిని బలోపేతం చేయాలని కోరారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 2న మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభమయ్యే గీతన్న చైతన్య యాత్ర ఆగస్టు 18న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ముగుస్తుందని తెలిపారు.
18 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా సాగుతుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఈ యాత్ర ఆగస్టు 13న ప్రవేశిస్తుందని, హత్నూర మండలం దౌల్తాబాద్ నుంచి ప్రారంభమై సంగారెడ్డి, జోగిపేట, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట, నారాయణఖేడ్, నిజాంపేట్ ప్రాంతాల మీదుగా కొనసాగుతుందని వివరించారు.
జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని, గౌడ సోదరులు, కల్లుగీత కార్మికులు, వృత్తి శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, హరీష్ గౌడ్, యాదగౌడ్, వెంకటేశం గౌడ్, సాయగౌడ్, గంగన్నగౌడ్, అశోక్ గౌడ్, రాధాకృష్ణ గౌడ్, కృష్ణగౌడ్, రాజాగౌడ్, కవి–రచయిత ఉమ్మన్నగారి కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.



