Sangareddy

కంది సెంట్రల్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

-ఖైదీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులకు ఆదేశం

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య బుధవారం కంది సెంట్రల్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా జైలులోని బ్యారక్‌లు, ఖైదీల గదులు, వంటశాల, ఆహార నిల్వ గది, జైలు ఆవరణతో పాటు ఇతర సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఖైదీలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు సమకూరేలా చర్యలు తీసుకోవాలని జైలర్‌కు సూచించారు. అలాగే ఖైదీలకు సమయానికి బెయిల్, ములాఖత్ సౌకర్యాలు అందుతున్నాయా, కేసుల పరిష్కారానికి అవసరమైన న్యాయ సహాయం లభిస్తోందా అనే అంశాలను పరిశీలించారు. ఆర్థికంగా వెనుకబడిన ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయవాదులను నియమించి న్యాయ సహాయం అందజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. జైలులో ఖైదీలకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించడంతో పాటు వంటశాల, కూరగాయలు, బియ్యం నిల్వ గదులను తనిఖీ చేశారు.

జైలులో పనిచేస్తున్న లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును కూడా సమీక్షించారు. ఈ తనిఖీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య, జైలర్ సత్తయ్య, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వ్యవస్థకు చెందిన న్యాయవాదులు, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button