రూ.100 కోట్లతో సంగారెడ్డి నియోజకవర్గంలో 83 కి.మీ. రోడ్ల అభివృద్ధి
-త్వరలో పనుల ప్రారంభానికి ఏర్పాట్లు –అధికారులతో సమీక్ష నిర్వహించిన జగ్గారెడ్డి, నిర్మల

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి నియోజకవర్గంలో రూ.100 కోట్ల వ్యయంతో మొత్తం 83 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. ఇందులో 29 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు, 54 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించి పనులను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రహదారులకు కనీసం పునరుద్ధరణ పనులు కూడా చేపట్టలేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన రహదారులనే ప్రజలు ఇప్పటికీ వినియోగిస్తున్నారని, పదేళ్లపాటు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.
సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు, గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాలను అనుసంధానించేలా కొత్త రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జాతీయ రహదారి-65 నుంచి లక్డారం, బ్యాతోల్, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, పెద్దాపూర్–అనంతసాగర్ మార్గంతో పాటు చిమ్నాపూర్ తండా, మల్కాపూర్, తాళ్లపల్లి, చేర్యాల, మామిడిపల్లి, ఎర్దనూరు, మెలిగిరిపేట, మాచిరెడ్డిపల్లి, అనంతసాగర్, కొండాపూర్, గొల్లపల్లి, నాగ్‌సాన్‌పల్లి, మారేపల్లి తదితర ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే, గతంలో పూర్తయి బిల్లులు పెండింగ్‌లో ఉన్న పనులపై కూడా అధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు.
పెండింగ్ బిల్లుల విడుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఈ పనులు పూర్తయితే సంగారెడ్డి నియోజకవర్గంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడి ప్రజలకు మెరుగైన రహదారి అనుసంధానం అందుబాటులోకి వస్తుందని జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి పేర్కొన్నారు.



