Sangareddy

ప్రమాదకరంగా మారిన కల్వర్టు.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

-తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికుల డిమాండ్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని ఐటీఐ నుంచి గొల్లగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరుకోవడంతో నిత్యం ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేపట్టకపోవడం, రక్షణ గోడలు లేకపోవడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని వారు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఓ వ్యక్తి సైకిల్‌పై ఈ మార్గంలో వెళ్తుండగా చీకటిలో కల్వర్టును గుర్తించలేక సైకిల్‌తో సహా లోయలో పడిపోయాడు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న విక్కీ యాదవ్ అనే యువకుడు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించి బాధితుడిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, సమయానికి సహాయం అందకపోయి ఉంటే విషాదం చోటుచేసుకునేదని పేర్కొన్నారు. ఒక ప్రాణనష్టం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక 9వ వార్డు నాయకుడు లాడే బాలు యాదవ్ మాట్లాడుతూ, కల్వర్టు ప్రమాదకరంగా మారిన విషయాన్ని ఇప్పటికే పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ రహదారిని ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, ద్విచక్రవాహనదారులు వినియోగిస్తున్నారని, ఇలాంటి ప్రధాన మార్గంలో కనీస భద్రతా చర్యలు లేకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడ్డారు. కల్వర్టుకు తక్షణమే మరమ్మతులు చేపట్టడంతో పాటు రక్షణ గోడలు (ప్యారపెట్ వాల్) నిర్మించాలని, రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించే హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని ప్రజలు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button