డీజీపీని కలిసిన ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్‌రావు
జహీరాబాద్‌లో పోలీస్ స్టేషన్ అప్‌గ్రేడ్, ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు వినతి

తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డీజీపీకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జహీరాబాద్ పట్టణంలో వేగంగా పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక విస్తరణ, ట్రాఫిక్ సమస్యలను ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను తక్షణమే అప్‌గ్రేడ్ చేయడంతో పాటు ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
జహీరాబాద్ పట్టణ జనాభా లక్షకు పైగా చేరుకోవడం, ఇటీవల ఐదు గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడం, పారిశ్రామిక ప్రాంతాల్లో అనేక చిన్న, పెద్ద పరిశ్రమలు ఏర్పడటంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి కోసం ఇక్కడికి వస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు.
ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు వేగవంతమైన పోలీసింగ్ అందించాలంటే పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం అవసరమని పేర్కొన్నారు. అలాగే పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రత, మహిళల రక్షణ, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీజీపీని కోరారు. ఈ అంశాలపై డీజీపీ సి.వి. ఆనంద్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు తెలిపారు.



