ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి
పీసీఆర్, పీఓఏ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలి – జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 22 (రథసారథి న్యూస్):
పీసీఆర్, పీఓఏ చట్టాలను జిల్లాలో మరింత సమర్థవంతంగా అమలు చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం, పీసీఆర్, పీఓఏ చట్టాల అమలుపై సమీక్షా సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో చోటుచేసుకునే ఎస్సీ, ఎస్టీలపై వివక్ష, అట్రాసిటీ ఘటనలను అత్యంత బాధ్యతాయుతంగా పరిగణించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులోకి రాని వాస్తవ ఘటనలను రెవెన్యూ, పోలీసు అధికారులు గుర్తించి, వాస్తవమైన ప్రతి కేసును నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సూచించారు. బాధితులకు చట్టప్రకారం అందాల్సిన రక్షణ, సహాయం, ఆర్థిక ఉపశమనం, న్యాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రతి నెల 30వ తేదీన సివిల్ రైట్స్ డే నిర్వహించాలని, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో సబ్ డివిజనల్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆర్డీవోలకు ఆదేశించారు. 2022 నుండి ఇప్పటివరకు జిల్లాలో నమోదైన 144 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ఆర్థిక ఉపశమనం కింద సుమారు రూ.2.58 కోట్ల నిధులు అవసరమవగా, ఇప్పటివరకు రూ.1.74 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అందులో 37 మంది బాధితులకు రూ. 68,87,500/- విడుదల చేసినట్లు, మిగిలిన అర్హులైన బాధితులకు ఆర్థిక ఉపశమనం అందజేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు వివరించారు.
సమావేశంలో పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై జిల్లా కలెక్టర్ డీఎస్పీలను కేసుల వారీగా వివరాలు అడిగి తెలుసుకుని, దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా అధికారులు పనిచేయాలని సూచించారు. దర్యాప్తును నిర్ణీత గడువులో పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని, గ్రామ, మండల స్థాయి కమిటీల ద్వారా అర్హులైన వారికి కుల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందజేయాలని అన్నారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, 2026 జూన్ నెలాఖరు వరకు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద 31 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందులో 12 కేసులు దర్యాప్తు దశలో ఉండగా, 19 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రతి కేసులో బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తూ, చట్టప్రకారం సత్వర న్యాయం అందేలా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి జగదీష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ, ఏసీపీలు, డీఎస్పీలు, రెవెన్యూ డివిజనల్ అధికారులు రాజేందర్, దేవుజ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



