గాంధీ భవన్ ముట్టడిస్తే బీజేపీ కార్యాలయం ముట్టడిస్తాం: జగ్గారెడ్డి
నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 22 (రథసారథి న్యూస్):: గాంధీ భవన్‌ను ముట్టడిస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. బీజేపీ నాయకులు గాంధీ భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ శ్రేణులు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
అవసరమైతే కేంద్ర మంత్రులను సైతం ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి నివాసం ఎదుట చేపట్టిన ధర్నాలో ఎలాంటి తప్పు లేదని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థుల తరఫున పోరాడిన వారిపై పోలీసులు దాడి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించలేదని, కనీసం దేశ విద్యార్థులకు క్షమాపణ కూడా చెప్పకపోవడం విచారకరమని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్లే ప్రధాని నరేంద్ర మోదీ బేషరతుగా దేశ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, రాజకీయ విమర్శలకు బదులుగా సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.



