Sangareddy

పసిపాపకు అండగా నిలిచిన కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్

తీవ్ర మూత్రపిండాల వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆరేళ్ల చిన్నారికి అవసరమైన శస్త్రచికిత్స ఖర్చును భరిస్తానని సంగారెడ్డి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ (నాని) ప్రకటించారు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 26 (రథసారథి న్యూస్):

తీవ్ర మూత్రపిండాల వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆరేళ్ల చిన్నారికి అవసరమైన శస్త్రచికిత్స ఖర్చును భరిస్తానని సంగారెడ్డి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ (నాని) ప్రకటించారు. సుమారు రూ.2 లక్షల వ్యయంతో నిర్వహించాల్సిన శస్త్రచికిత్సకు అవసరమైన మొత్తాన్ని తానే సమకూరుస్తానని ఆయన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్షపేట గ్రామానికి చెందిన చిన్నారి తీవ్ర మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. వ్యాధి కారణంగా చిన్నారి తల్లి గతంలో మృతి చెందగా, అంతకుముందే తండ్రిని కూడా కోల్పోయింది. ప్రస్తుతం నాయనమ్మ సంరక్షణలో జీవిస్తున్న చిన్నారికి తక్షణమే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. అయితే, శస్త్రచికిత్సకు అవసరమైన రూ.2 లక్షల వ్యయాన్ని భరించే స్థోమత లేక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

చిన్నారి పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన సమాచారాన్ని గమనించిన కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం చికిత్సకు అవసరమైన మొత్తం వ్యయాన్ని తానే భరిస్తానని ప్రకటిస్తూ, డబ్బు కొరత వల్ల చిన్నారి చికిత్స ఆగిపోకూడదని స్పష్టం చేశారు. కౌన్సిలర్ ఇచ్చిన భరోసాతో చిన్నారి కుటుంబంలో ఆశలు చిగురించాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చిన్నారి పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ మానవతా నిర్ణయాన్ని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం సమాజానికి ఆదర్శప్రాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button