హరీశ్ రావుపై ఆరోపణలకు ఆధారాలు చూపాలి
-ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక కాంగ్రెస్ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోంది-ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్): మాజీ మంత్రి హరీశ్ రావు లేవనెత్తిన ప్రజా సమస్యలకు సమాధానం చెప్పే ధైర్యం, వాటిని పరిష్కరించే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడంతో క్షుద్ర రాజకీయాలకు తెరలేపిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విమర్శించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హిందూ సంస్కృతిని అగౌరవపరుస్తూ, పవిత్ర ఆలయాల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అర్చకుల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, సనాతన ధర్మం, ధార్మిక కార్యక్రమాలపై దుష్ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గోదావరి జలాలను రైతుల పొలాలకు తరలించడం, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయడం, పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి చెల్లింపు, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం వంటి హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక హరీశ్ రావుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హరీశ్ రావుపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు. గుడులకు వెళ్లడం, పూజలు చేయడం తప్పు అన్నట్లుగా మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
క్షుద్ర పూజల చరిత్ర కాంగ్రెస్ పార్టీకేనని ఆరోపించిన ఆయన, గతంలో వివాదాస్పద తాంత్రికుడు చంద్రస్వామితో పూజలు నిర్వహించిన ఘటనలను గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర శ్రేయస్సు, వర్షాల కోసం యాగాలు, యజ్ఞాలు నిర్వహించామని తెలిపారు. ప్రజలకు అవసరమైనది రాజకీయ విమర్శలు కాదని, సమస్యలకు పరిష్కారాలు, ప్రశ్నలకు సమాధానాలేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భక్తి, విశ్వాసాలను రాజకీయాలకు వాడుకోవద్దని సూచించారు. వర్షాలు కురవకపోయినా, రుణమాఫీ అమలు కాకపోయినా, విద్యుత్ కోతలు వచ్చినా అన్నింటికీ హరీశ్ రావునే బాధ్యుడిగా చూపించే ప్రయత్నం చేయడం విడ్డూరమని అన్నారు.
అధికారంలో ఉన్న ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని చింత ప్రభాకర్ హెచ్చరించారు.



