
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్):
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెల పొడవునా సురక్షా కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ పేరుతో జాతీయ సైబర్ జాగ్రూకత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) డైరెక్టర్ షికా గోయల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. జాతీయ సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఎస్పీ మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో సైబర్ నేరాలు ఒకటని పేర్కొన్నారు.
ముఖ్యంగా విద్యావంతులే అధికంగా సైబర్ మోసాలకు గురవుతుండడం ఆందోళనకరమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాదిలోనే సైబర్ మోసాల కారణంగా సుమారు రూ.1,300 కోట్ల మేర ప్రజలు ఆర్థికంగా నష్టపోయినట్లు వెల్లడించారు. త్వరగా అధిక లాభాలు వస్తాయనే ఆశతో తెలియని వ్యక్తులు పంపే లింకులను తెరవడం, నకిలీ స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ పథకాలు, వ్యాపార పెట్టుబడుల పేరుతో వచ్చే మోసపూరిత సందేశాలను నమ్మడం వల్ల ప్రజలు మోసపోతున్నారని తెలిపారు.
సైబర్ నేరాలను అరికట్టడంలో అప్రమత్తతే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు. తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. విద్యార్థులు సైబర్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. సురక్షా కా తిరంగాలోని మూడు రంగుల సందేశం, కాషాయం సైబర్ మోసాలు, అనుమానాస్పద ఆన్‌లైన్ ఆఫర్ల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
తెలుపు సైబర్ భద్రతపై అవగాహన పెంచుకుని బాధ్యతాయుతంగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించాలి. ఆకుపచ్చ సురక్షితమైన సైబర్ విధానాలను పాటిస్తూ డిజిటల్ భద్రతను కాపాడుకోవాలి. ఆగస్టు నెల మొత్తం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పరిశ్రమల్లో డిజిటల్ అరెస్ట్, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు తదితర ఆన్‌లైన్ ఆర్థిక నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అదనపు ఎస్పీ వెల్లడించారు. అనంతరం సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలు తదితర సైబర్ నేరాలపై షార్ట్ వీడియో ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్కు కాల్ చేయడం లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా ఆర్థిక నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుందని వివరించారు. సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో అవగాహనే అత్యంత ప్రభావవంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ ఆంథోనీ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, చైర్మన్ డా. సాల్మన్ రెడ్డి, డిగ్రీ కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, టౌన్ ఇన్‌స్పెక్టర్ రామునాయుడు, సైబర్ సెల్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



