Medak

ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి

ముందస్తు కార్యాచరణతో నష్టాన్ని తగ్గించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి,మెదక్, సంగారెడ్డి జిల్లాల ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 20 (రథసారథి న్యూస్):

ఎల్-నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మెదక్, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎల్-నినో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఈ సందర్భంగా వివిధ శాఖలు చేపట్టాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలు, జిల్లాల వారీ సన్నాహకాలపై సమగ్రంగా సమీక్షించారు. ఎల్-నినో ఒక సహజ ప్రకృతి ప్రభావమని, దాని వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు అంచనాలు, సమర్థవంతమైన కార్యాచరణ అవసరమని మంత్రి పేర్కొన్నారు. లోటు వర్షపాతం, నీటి కొరత, పంటలపై ప్రతికూల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, భూగర్భ జలాలు, విద్యుత్ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయంలో నీటి వినియోగాన్ని తగ్గించే పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలని సూచించిన మంత్రి, ఒక ఎకరం వరి సాగుకు అవసరమైన నీటితో నాలుగు ఎకరాల ఆయిల్‌పామ్ లేదా ఎనిమిది ఎకరాల కంది సాగు సాధ్యమవుతుందని తెలిపారు.

పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు, అంతర్ పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అవగాహన కల్పించేందుకు వీడియోలు, కళాజాతాలు, నాటకాలు, ఇతర ప్రచార మాధ్యమాలను వినియోగించాలని సూచించారు. కోతుల బెడద అధికంగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపడితే రైతులు పంటల మార్పిడికి మరింతగా ఆసక్తి చూపుతారని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని నీటి వృథాను నివారించడం, భూగర్భ జలాల సంరక్షణ, బోర్‌వెల్ రీచార్జ్, వర్షపు నీటి సంరక్షణ వంటి చర్యలను విస్తృతంగా అమలు చేయాలని మంత్రి సూచించారు.

ప్రజలకు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పశువులకు మేత కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య శాఖ సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి ఎ. వాణి ప్రసాద్ మాట్లాడుతూ, ఎల్-నినో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం అన్ని శాఖలను సమాయత్తం చేస్తోందన్నారు.

అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడడమే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని వివరించారు. అనంతరం మంత్రి జలసిరి ప్రచార పోస్టర్లతో పాటు జిల్లా కంటింజెన్సీ ప్లాన్‌ను ఆవిష్కరించారు. అంతకుముందు వివిధ శాఖల అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్షపాత పరిస్థితులు, పంటల సాగు, భూగర్భ జలాల స్థితి, జల వనరుల లభ్యత, తాగునీటి సరఫరా, విద్యుత్ పరిస్థితులు, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై వివరాలు వెల్లడించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజీవరెడ్డి, మాణిక్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button