Sangareddy

మండలంలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

- ప్రతి గ్రామాన్ని వారానికోసారి సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించాలి - సంగారెడ్డి మండల ప్రత్యేక అధికారి చలపతిరావు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 21 (రథసారథి న్యూస్):

సంగారెడ్డి మండలంలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై మండల ప్రత్యేక అధికారి, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ చలపతిరావు ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎంపీడీఓతో పాటు నీటి పారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మిషన్ భగీరథ, హౌసింగ్, పంచాయతీరాజ్ శాఖల అసిస్టెంట్ ఇంజనీర్లు, మండల వ్యవసాయ అధికారి, మండల విద్యాధికారి, పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి, వైద్యాధికారి, మండల పంచాయతీ అధికారి, ఏపీఓ (ఉపాధి హామీ), ఏపీఎం (సెర్ప్), సీడీపీఓ (ఐసీడీఎస్), టీజీపీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమీక్ష సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు పురోగతి, పెండింగ్ పనులు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, తాగునీటి సరఫరా, గృహ నిర్మాణాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి హామీ, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి చలపతిరావు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని ప్రతి గ్రామాన్ని అధికారులు ప్రతి వారం స్వయంగా సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించాలని, ప్రతి వారం పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి నిహారిక , యంపీఓ శ్రీకాంత్, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button