టీజేఎంయూ ఎన్నికల శంఖారావం
ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయడమే లక్ష్యం: హనుమంత్ ముదిరాజ్ -సంగారెడ్డిలో టీజేఎంయూ విజయమే ధ్యేయం: తోపాజి అనంత కిషన్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 22 (రథసారథి న్యూస్): తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ఆధ్వర్యంలో మెదక్ రీజియన్ సర్వసభ్య సమావేశం బుధవారం సంగారెడ్డిలో నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్, గౌరవ అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మెదక్ రీజియన్ పరిధిలోని వివిధ ఆర్టీసీ డిపోల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి డిపో గౌరవ అధ్యక్షుడిగా నియమితులైన తోపాజి అనంత కిషన్‌ను నాయకులు సత్కరించారు. సమావేశంలో హనుమంత్ ముదిరాజ్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేసి కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించడమే టీజేఎంయూ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న యూనియన్లు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శిస్తూ, రానున్న ఎన్నికల్లో టీజేఎంయూను గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
టీజేఎంయూ గౌరవ అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ సంగారెడ్డి డిపోలో టీజేఎంయూను ఘన విజయానికి చేర్చడమే తన ధ్యేయమని తెలిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మార్గదర్శకత్వంలో యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర, ప్రాంతీయ నాయకులు, వివిధ డిపోల కార్మికులు, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



