రాహుల్ గాంధీ పోరాటం విద్యార్థులు, ప్రజల ప్రయోజనాల కోసమే: జగ్గారెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న పోరాటం దేశ విద్యార్థులు, ప్రజల ప్రయోజనాల కోసమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 25 (రథసారథి న్యూస్):
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న పోరాటం దేశ విద్యార్థులు, ప్రజల ప్రయోజనాల కోసమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో ఐబీ గెస్ట్ హౌస్ నుంచి పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన రాహుల్ గాంధీ విక్టరీ ర్యాలీ లో ఆయనతో పాటు ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ్ కుమార్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ చేసిన ఉద్యమాల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. నీట్ వ్యవహారంలో బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజల సంక్షేమం, భద్రత కోసం రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని, ఆయన పిలుపునిస్తే సంగారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు ఎప్పుడూ ఉద్యమాలకు సిద్ధంగా ఉంటాయని అన్నారు.
ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ్ కుమార్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో బాధ్యతాయుత రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చిన చరిత్ర ఉందని, లాల్ బహదూర్ శాస్త్రి, మాధవరావు సింధియా వంటి నాయకులు నైతిక బాధ్యతతో రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏఐసీసీ పిలుపు కంటే ఎక్కువ ఉత్సాహంతో జగ్గారెడ్డి ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశంసించారు.



