Sangareddy

విద్యార్థి విజ్ఞాన మంథనం–2026–27కు దరఖాస్తుల ఆహ్వానం

-ప్రతిభావంతులకు జాతీయ పరిశోధనా సంస్థల్లో శిక్షణ.. భాస్కర ఉపకార వేతనానికి అవకాశం

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 26 (రథసారథి న్యూస్):

దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక విద్యార్థి విజ్ఞాన మంథనం–2026–27 పరీక్షలో ఆరవ తరగతి నుంచి పదకొండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనాలని సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి ఒక ప్రకటనలో కోరారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దేశంలోని ప్రముఖ జాతీయ శాస్త్ర పరిశోధనా సంస్థల్లో ప్రత్యేక శిక్షణ పొందే అవకాశం కల్పించడంతో పాటు, భాస్కర ఉపకార వేతన పథకం కింద జాతీయ స్థాయి విజేతలకు ఏడాది పాటు ప్రతి నెల రూ.2,000 చొప్పున ఉపకార వేతనం అందజేయనున్నట్లు తెలిపారు.

విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించడం, భారతీయుల ప్రాచీన, ఆధునిక శాస్త్రీయ కృషిని పరిచయం చేయడం, ఉన్నత విద్యలో శాస్త్ర విజ్ఞాన రంగం వైపు ప్రోత్సహించడం, ప్రతిభావంతులను గుర్తించి వారికి శిక్షణా శిబిరాలు, శాస్త్రీయ సమావేశాలు నిర్వహించడం, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పురస్కారాలతో సత్కరించడం, దేశభక్తి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఈ పరీక్ష ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ఆరవ, ఏడవ, ఎనిమిదో తరగతుల విద్యార్థులు జూనియర్ విభాగంలో, తొమ్మిదో, పదో, పదకొండో తరగతుల విద్యార్థులు సీనియర్ విభాగంలో పాల్గొనవచ్చని తెలిపారు.

పరీక్ష తెలుగు, హిందీతో పాటు మొత్తం 14 భారతీయ భాషల్లో నిర్వహించబడుతుందని, ఇంటి నుంచే చేతి దూరవాణి, పలక గణకం, మడత గణకం లేదా గణక యంత్రం ద్వారా నిర్వహించే అంతర్జాల పరీక్షగా ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ తొలి వారంలో నమూనా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 16 నుంచి 21వ తేదీల మధ్య తరగతుల వారీగా తొలి దశ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పాఠశాల, జిల్లా స్థాయిలో ప్రతి తరగతిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ప్రతిభా ధ్రువపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు నగదు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో విజేతలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు నగదు బహుమతులతో పాటు ప్రముఖ జాతీయ శాస్త్ర పరిశోధనా సంస్థల సందర్శన, ప్రత్యేక శిక్షణ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. పరీక్షలో పాల్గొనే ప్రతి విద్యార్థికి పాల్గొన్నట్లు ధ్రువపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.

అన్ని పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను ఈ ప్రతిష్ఠాత్మక పరీక్షలో పాల్గొనేలా ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు జిల్లా విజ్ఞానశాస్త్ర అధికారి సిద్ధారెడ్డి, జిల్లా సమన్వయకర్త కీర్తి చంద్రిక మఠంను సంప్రదించాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button