విద్యాశాఖ మంత్రి రాజీనామా విద్యార్థుల ఆవేదనకు ప్రభుత్వం ఇచ్చిన స్పందనే
విద్యాశాఖ మంత్రి రాజీనామా విద్యార్థుల ఆవేదనకు ప్రభుత్వం ఇచ్చిన స్పందనే-ఎంపీ రఘునందన్ రావు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 26 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శిశిర ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎం. రఘునందన్ రావు హాజరై కార్యక్రమాన్ని సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు రాజకీయ అంశాలపై స్పందించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా ఎవరి విజయమో, పరాజయమో కాదని, విద్యార్థుల ఆవేదనను, తల్లిదండ్రుల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బాధ్యతాయుత నిర్ణయమని పేర్కొన్నారు. తప్పు జరిగితే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసే రాజకీయ సంస్కృతిని చాలా మంది నాయకులు మరచిపోయారని, అలాంటి బాధ్యతను స్వీకరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. ప్రశ్నాపత్రం లీక్ ఘటన అనంతరం పరీక్షలను రద్దు చేసి, తిరిగి పరీక్షలు నిర్వహించి, ఫలితాలను త్వరగా విడుదల చేయడం ద్వారా విద్యార్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకున్న పార్టీ బీజేపీయేనని చెప్పారు.
ఈ అంశంపై కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో ప్రశ్నాపత్రాలు వాట్సాప్ ద్వారా రూ.1,000 నుంచి రూ.1,500కు విక్రయించబడ్డాయని ఆరోపణలు వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఎందుకు బాధ్యత వహించలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరమని రఘునందన్ రావు అన్నారు. యువ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించి విద్యాశాఖ వంటి కీలక బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నిర్ణయానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమతి కోసం ఎదురుచూడకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో బీసీ వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించడంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన, యువ నాయకులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని సూచించారు.
మెదక్‌కు చెందిన రోహిత్ రెడ్డి, పరకాల యశస్వినీ రెడ్డి, మహబూబ్‌నగర్‌కు చెందిన పర్ణిక రెడ్డి వంటి యువ నాయకులకు బాధ్యతలు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దనే పలు కీలక శాఖలు ఉండటం వల్ల పాలన, అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోందని రఘునందన్ రావు విమర్శించారు. యువతకు అవకాశాలు కల్పించడం ద్వారా పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని ఆయన పేర్కొన్నారు.


