ఆర్టీసీ కార్మిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: టీఎంయూ
-రీజనల్ మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించిన యూనియన్ ప్రతినిధులు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్):
ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) మెదక్ రీజనల్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం టీజీఎస్‌ఆర్టీసీ మెదక్ రీజియన్ రీజనల్ మేనేజర్‌ను కలిసి పలు సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని సమర్పించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ. అశ్వత్థామ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ భేటీలో పెండింగ్ పదోన్నతులు, స్పెషల్ గ్రేడ్‌ల మంజూరు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది కొరత భర్తీ, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, మహిళా ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాల కల్పన, పెండింగ్ ఇంక్రిమెంట్ బకాయిల చెల్లింపు, ఖాళీ పోస్టుల భర్తీ, కార్మిక చట్టాల అమలు తదితర అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
వినతిపత్రంలో ప్రస్తావించిన అంశాలను సానుకూలంగా పరిశీలించి, నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని రీజనల్ మేనేజర్ హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఈ. అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు కార్మికుల భవిష్యత్తును నిర్ణయించే కీలకమైనవని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత, పూర్తి ప్రభుత్వ విలీనం, సంక్షేమ హక్కుల సాధనే టీఎంయూ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
కార్మికులు ప్రలోభాలకు లోనుకాకుండా సమస్యల పరిష్కారాన్ని ప్రధాన అజెండాగా తీసుకుని సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేడీ రాధాకిషన్ రావు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ బి. సుబ్బారావు, రీజనల్, డివిజనల్, డిపో స్థాయి యూనియన్ నాయకులు పాల్గొన్నారు.



