Sangareddy

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు

-గిరిజనుల హక్కుల పరిరక్షణకు చట్టాలపై అవగాహన అవసరం -డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి బి.సౌజన్య

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 7 (రథసారథి న్యూస్): అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవా సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ), సంగారెడ్డి ఆధ్వర్యంలో పటాన్‌చెరు మండలంలోని ఇంద్రేశం–పెద్దకంజర్ల తెలంగాణ గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి బి. సౌజన్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారత రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన రాజ్యాంగబద్ధమైన హక్కులు, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, భూ హక్కులు, అటవీ హక్కుల పరిరక్షణతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.

గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి, భాష, జీవన విధానాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలోని బలహీన వర్గాలకు న్యాయం అందించడంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలు, మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్‌ల ద్వారా త్వరితగతిన న్యాయం అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల హక్కులు, బాలల హక్కులు, పోక్సో చట్టం, గృహహింస నిరోధక చట్టం, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ర్యాగింగ్ నిరోధం, బాధితుల పరిహార పథకం, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

విద్యార్థులు ఉన్నత విద్యతో పాటు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని సమాజంలో జరిగే అన్యాయాలను నిరోధించడంలో చైతన్యవంతులుగా వ్యవహరించాలని సూచించారు. తమ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలకు కూడా న్యాయ అవగాహన కల్పించి చట్టాల పట్ల గౌరవాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా న్యాయ సేవా సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయాన్ని పొందాలని, న్యాయ సేవా సంస్థల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు న్యాయ సంబంధిత ప్రశ్నలకు కార్యదర్శి బి.సౌజన్య సమాధానాలు ఇచ్చి, చట్టాలపై అవగాహన కలిగిన యువతే సమాజాభివృద్ధికి మార్గదర్శకులవుతారని పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button